రైతుల గోసలు ఎన్నడూ తీరేనో: తెలంగాణ క్రాంతిదళ్
వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, ఆర్రూరు, వేములకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “నెత్తిపై గడ్డిమోపులు, జేబులో వడ్ల గింజలు, కళ్లం నిండా ధాన్యం ఉన్న రైతన్న పళ్లెంలో మాత్రం మెతుకు లేదన్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరం” అన్నారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే తరుగు పేరుతో క్వింటాలుకు 4 నుంచి 5 కిలోల వరకు ధాన్యం కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయలేని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఒక వారం రోజుల్లోపు రైతుల పూర్తి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, సనత్, జయసూర్య, ఇంజమూరి రాము, జక్కల మత్స్యగిరి, కొత్త నరసింహ, దుర్గం శంకర్, మనోహర్, కూకుట్ల లింగస్వామి, వెంకట్ రెడ్డి, గజ్జి ఐలయ్య, ప్రశాంత్, పోలేబోయిన మమత, లింగస్వామి శ్రీనాథ్, చెగురి వంశీరాజ్, సారగండ్ల మాచగిరితో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.