పాలమూరు రైతులకు నీరు అందించకుండా వరద నీటిని వృథా చేయొద్దని ప్రభుత్వానికి మాజీ మంత్రి డిమాండ్
హైదరాబాద్, జూలై 27:
జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న నేపథ్యంలో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల లిఫ్ట్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం చేరుకుందని, ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు.భీమా-1లో భూత్పూర్, సంగంబండ, భీమా-2లో శంకర సముద్రం, రంగసముద్రం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి, ర్యాలంపాడు, కోయిల్‌సాగర్ రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే పంపులను ప్రారంభించాలని, అలాగే జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.