IMG-20260705-WA0195

భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార సమరభేరి..

బీసీ రాజ్యాధికారమే లక్ష్యమన్న తీన్మార్ మల్లన్న

భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభకు భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఒగ్గుకథలు, ప్రజా కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సవరించి భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక న్యాయం సాధించే దిశగా తమ పార్టీ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.సభలో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య, ఎంబీటీ ప్రతినిధి అంజదుల్లా ఖాన్, అమెరికా నుంచి వచ్చిన వెంకట్ మారోజు తదితరులు ప్రసంగించారు.

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన డాక్టర్ భిక్షపతి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరగా, మాజీ మావోయిస్టు నేత పిట్టల శంకర్ కూడా పార్టీలో చేరారు.తెలంగాణలో బీసీల జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని మల్లన్న పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించి అధికారంలోకి రావడమే లక్ష్యమని చెప్పారు. రైతుల సమస్యలు, భూముల పంపిణీ, సామాజిక న్యాయం, బీసీల రాజకీయ సాధికారత వంటి అంశాలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.