వర్షాలు సమృద్ధిగా కురవాలి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
నల్గొండ, టీజీ సమాచారం :
నాగార్జునసాగర్‌లో శాస్త్రోక్తంగా మహా వరుణయాగం.. పూర్ణాహుతి సమర్పించిన సీఎం దంపతులునాగార్జునసాగర్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున శాస్త్రోక్తంగా పూర్తయింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య నిర్వహించిన యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో పూర్ణాహుతి సమర్పించారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుడి అనుగ్రహం కోసం హోమక్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. భూగర్భ జలాలు పెరిగి పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, తెలంగాణ సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో వరుణయాగం నిర్వహించినట్లు సీఎం తెలిపారు.వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం భారతీయ సంస్కృతిలో పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ప్రభుత్వం పేర్కొంది. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ప్రకృతి, వ్యవసాయం, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తూ వరుణదేవుడిని ప్రార్థించినట్లు తెలిపింది.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.