అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి:
బీజేపీ నేతల డిమాండ్
భైంసా , ఆగస్టు 3:
నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్, బీజేపీ నాయకుడు బాలాజీ సూత్రవే స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న కొందరు మిల్లర్లు తిరిగి బియ్యం అప్పగించకుండా బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా ప్రారంభమైన మిల్లులు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బ్లాక్‌లిస్టులో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విజిలెన్స్ విచారణ చేపట్టాలని అధికారులను కోరారు.