ఏర్దనూరు బేతల్ గ్రామంలో అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి : ఆప్ ఆగ్రహం
టీజీ సమాచారం , సంగారెడ్డి :1
కంది మండలం, ఏర్దనూరు బేతల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 231లో ఉన్న అసైన్డ్ భూముల్లో అనుమతులకు మించి అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నీరేటి ఆంజనేయులు, సంగారెడ్డి ఇన్‌చార్జ్ మిట్టపల్లి రాజేష్, రాష్ట్ర నాయకులు తేజాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ, మైనింగ్ పేరుతో ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. మోనోకల్చర్ చెట్ల పెంపకం పేరుతో స్థానిక పర్యావరణానికి, రైతుల జీవనాధారానికి నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని ప్రాంతాల్లో, అనుమతించిన పరిమితులను దాటి మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల చెట్లు, సహజ వనరులు, భూగర్భ జలాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన డిమాండ్లు:
1. సర్వే నంబర్ 231లో జరుగుతున్న మైనింగ్‌పై తక్షణమే విచారణ జరపాలి.
2. అనుమతులకు మించి జరుగుతున్న మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలి.
3. అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, అక్రమ వినియోగంపై చర్యలు తీసుకోవాలి.
4. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
5. రైతుల భూములు, నీటి వనరులు, ప్రకృతిని కాపాడాలి.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతుల ప్రయోజనాలను మరియు తెలంగాణ పర్యావరణాన్ని కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ డిమాండ్ చేస్తోందని ఆమె పేర్కొన్నారు.