వలిగొండ శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
భవన అనుమతులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణ
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి
యాదాద్రి భువనగిరి, జూన్ 18 (టీజీ సమాచారం):
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత అధికారుల తక్షణ జోక్యాన్ని కోరారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన భవన అనుమతులు, ఇతర ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు.పాఠశాల అనుమతులకు సంబంధించిన వివరాలు కోరగా యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని, సంబంధిత ఎంఈవోను సంప్రదించగా అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.ఆట స్థలం లేకుండా విద్యార్థులకు ఇబ్బందులుపాఠశాలలో సరైన ఆట స్థలం లేకపోవడంతో పాటు ఇరుకు గదుల్లో విద్యార్థులను ఉంచుతున్నారని నాయకులు విమర్శించారు. పాఠశాల సమీపంలో భీమలింగం కత్వ కాలువ ఉండటం వల్ల విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు.ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలిమండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఫీజుల నియంత్రణతో పాటు అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు మారోజు నరసింహాచారి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సూరారం కళ్యాణ్, ఏఐవైఎఫ్ మండల సమితి సభ్యుడు కనకబోయిన నందు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.