వరంగల్, టీజీ సమాచారం :
పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు
“అదే ఆసుపత్రిలో పెద్దిని చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు”
నల్లబెల్లిలో దశదిన కర్మ, సంస్మరణ సభ.. భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న సుమారు 25 ఏళ్ల అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు, ఆస్తులు, పదవులను సైతం లెక్కచేయకుండా పోరాడారని హరీశ్ రావు అన్నారు. మానుకోట ఘటన, పరకాల, స్టేషన్ ఘన్పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిపై పెద్ది ప్రత్యేక శ్రద్ధ చూపారని హరీశ్ రావు తెలిపారు. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీటిని అందించేందుకు కృషి చేశారని, నర్సంపేటకు మెడికల్ కాలేజీ సాధించడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారని హరీశ్ రావు తెలిపారు.పెద్దితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న హరీశ్ రావు.. గతంలో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కొంతకాలం ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. పరకాల, స్టేషన్ ఘన్పూర్ ఉపఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇద్దరూ కలిసి పనిచేశామని తెలిపారు.ఉద్యమ సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకుంటూ హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులతో జరిగిన తోపులాటలో తాను డీసీఎం పైనుంచి కిందపడినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారని చెప్పారు. అదే ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం పడ్డ తపన, జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని హరీశ్ రావు అన్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స సమయంలో మెరుగైన వైద్యం కోసం అమెరికా లేదా లండన్ నుంచి వైద్యులను తీసుకురావడానికి ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు పేర్కొన్నారు. పెద్ది కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
