బేతుపల్లి చెరువు ఘటనపై మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణ
– కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా
– సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని అధికారులకు ఆదేశం
టీజీ సమాచారం , హైదరాబాద్:
సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం బోటు తిరగబడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాయి. వారిని మరో గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన రక్షణ పరికరాలు, బోట్లు అందుబాటులో ఉంచడంతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సహాయక చర్యల పురోగతిని జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.