IMG-20260731-WA0003(1)

జులై 28 అమరవీరుల స్మారక వారోత్సవం

చరిత్ర నుంచి స్ఫూర్తి, భవిష్యత్తుకు పోరాటం

జంపన్న

భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో జులై 28 ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన రోజు. 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన నుండి నేటి వరకు భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీ, సామాజిక అన్యాయం, కుల, వర్ణ వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వేలాది మంది కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజాసంఘాల కార్యకర్తలు తమ జీవితాలను అర్పించారు. శ్రామిక వర్గ రాజ్యాధికారం, సమానత్వం, సోషలిస్టు సమాజ నిర్మాణం అనే లక్ష్యాల కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ విప్లవ జోహార్లు.1987 నుండి అమరవీరుల స్మారక వారోత్సవాలను నిర్వహించడం ఒక చారిత్రక సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రజా ఉద్యమాలపై తీవ్రమైన నిర్బంధం కొనసాగిన కాలంలో అమరవీరులందరినీ విడివిడిగా స్మరించడం సాధ్యం కాకపోవడంతో ప్రతి సంవత్సరం ఒక వారంపాటు వారి స్మృతిని గౌరవించాలని నిర్ణయించారు. నక్సల్బరీ తిరుగుబాటు నాయకుడు, సీపీఐ ఎంఎల్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ 1972 జులై 28న పోలీసు కస్టడీలో మరణించిన రోజును అమరవీరుల స్మారక దినంగా నిర్ణయించడం ద్వారా ఈ వారోత్సవాలకు ఒక చారిత్రక గుర్తింపు ఏర్పడింది.చారు మజుందార్‌ను స్మరించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. నక్సల్బరీ, శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ, గోదావరి లోయ, దండకారణ్యం వంటి ప్రజా పోరాటాల చరిత్రను గుర్తు చేసుకోవడం. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వర్గపోరాటాన్ని తిరిగి ప్రధాన రాజకీయ ప్రశ్నగా నిలబెట్టిన చారిత్రక మలుపును గుర్తించడం. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వేలాది మంది అమరవీరుల త్యాగాలను స్మరించడం.ఆ పోరాటాల చరిత్రను తలచుకున్నప్పుడు కామ్రేడ్ చారు మజుందార్, కన్నయ్య చటర్జీ, కాను సన్యాల్, సరోజ్ దత్తా, కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, శిబ్దాష్ ఘోష్, వినోద్ మిశ్రా, సత్యమూర్తి వంటి నాయకులు భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తమదైన ముద్ర వేశారు. అలాగే కామ్రేడ్ నంబాల కేశవరావు, చలపతి, గాజర్ల రవి, అనురాధ గాంధీ, హరిభూషణ్, ఆనంద్, రామకృష్ణ, మారోజు వీరన్న, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, రేణుక, అరుణ, బడే నాగేశ్వరరావు, భారతక్క వంటి నాయకులు, పేరుప్రఖ్యాతులు లేని వేలాది మంది కార్యకర్తలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు ప్రజల కోసం పోరాడి తమ జీవితాలను అర్పించారు. ప్రజల విముక్తి కోసం సాయుధ రూపంలోనైనా, నిరాయుధ రూపంలోనైనా పోరాడి అమరులైన వారందరికీ ఈ సందర్భంగా విప్లవ జోహార్లు.సీపీఐ ఎంఎల్ ఉద్యమంలో సిద్ధాంతపరమైన, వ్యూహపరమైన, ఎత్తుగడలపరమైన లోపాలు లేవని చెప్పడం చారిత్రకంగా సరైంది కాదు. ప్రతి ఉద్యమం తన విజయాలతో పాటు తన పరిమితులను కూడా కలిగి ఉంటుంది. వాటిని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం అవసరం. అయితే ఆ లోపాల పేరుతో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను తక్కువ చేసి చూపడం కూడా చరిత్ర పట్ల అన్యాయమే అవుతుంది. చారిత్రక అనుభవాలను విమర్శనాత్మకంగా విశ్లేషించడం ఒక విషయం. ప్రజల కోసం జీవితాలను అర్పించిన వారి నిబద్ధతను గౌరవించడం మరో విషయం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం అవసరం.అమరవీరులను స్మరించడం అంటే వారు అనుసరించిన ప్రతి పోరాట రూపాన్ని, ప్రతి పోరాట పద్ధతిని యథాతథంగా పునరావృతం చేయడం కాదు. సమాజం మారుతుంది. ఉత్పత్తి సంబంధాలు మారుతాయి. రాజకీయ పరిస్థితులు మారుతాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో మార్పులు వస్తాయి. అందుకు అనుగుణంగా ఉద్యమాల రూపాలు, వ్యూహాలు, ఎత్తుగడలు కూడా మారుతాయి. కానీ ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన వారి నిజాయితీ, అంకితభావం, త్యాగస్ఫూర్తి, ప్రజల పట్ల వారి నిబద్ధత మాత్రం శాశ్వత విలువలుగా నిలుస్తాయి. అదే నేటి తరాలకు స్ఫూర్తి.ఈ స్ఫూర్తి కేవలం కమ్యూనిస్టు ఉద్యమానికే పరిమితం కాదు. వర్గ సమాజం, వర్ణ సమాజం ఏర్పడినప్పటి నుండి అన్యాయం, అసమానత, దోపిడీ, వివక్షలకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడిన ప్రతి మహనీయుడు ఈ చారిత్రక వారసత్వంలో భాగమే. చార్వాకులు హేతువాదాన్ని నిలబెట్టారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విద్య, సమానత్వం కోసం జీవితాలను అంకితం చేశారు. పెరియార్ కులాధిపత్యాన్ని సవాలు చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం పోరాడారు. భగత్ సింగ్ సామాజిక విముక్తిని రాజకీయ స్వాతంత్ర్యంతో ముడిపెట్టారు. ప్రజల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ప్రతి వ్యక్తి భారత ప్రజాస్వామిక, సామాజిక విముక్తి సంప్రదాయంలో చిరస్మరణీయుడే.మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక శాస్త్రం ప్రకారం సమాజంలోని అసమానతలు వ్యక్తుల స్వభావం వల్ల కాకుండా ఉత్పత్తి సాధనాలపై యాజమాన్య సంబంధాల వల్ల ఏర్పడతాయి. శ్రమ సంపదను సృష్టిస్తుంది. కానీ ఆ సంపదపై నియంత్రణ మూలధనానికి చెందుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సామాజికంగా జరిగినప్పటికీ దాని ఫలితాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతాయి. ఈ వైరుధ్యమే ఆర్థిక అసమానతలకు, శ్రమదోపిడీకి, నిరుద్యోగానికి, పేదరికానికి మూల కారణమని మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక విశ్లేషణ వివరిస్తుంది.ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి కేంద్రీకరణ మరింత వేగవంతమైంది. ఒకవైపు దేశ సంపదలో అధిక భాగం కొద్దిమంది కార్పొరేట్ గుత్తపెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, మరోవైపు నిరుద్యోగం, అసంఘటిత ఉపాధి, వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కుల క్షీణత, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి మౌలిక రంగాల వాణిజ్యీకరణ వేగంగా పెరుగుతున్నాయి. లాభాల గరిష్ఠీకరణే ప్రధాన లక్ష్యంగా మారిన పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రమ విలువ కంటే మూలధన విస్తరణకే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ వైరుధ్యాలే సమాజంలో అసమానతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.భారత సమాజ ప్రత్యేకత ఏమిటంటే ఆర్థిక దోపిడీ ఒక్కటే కాదు. అది కుల వ్యవస్థ, వర్ణ ఆధిపత్యం, పితృస్వామిక సంబంధాలు, మత వివక్ష, ప్రాంతీయ అసమాన అభివృద్ధి వంటి చారిత్రక నిర్మాణాలతో పెనవేసుకొని ఉంది. అందువల్ల వర్గ విముక్తి కోసం జరిగే పోరాటం సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆర్థిక దోపిడీని విస్మరించలేదు. ఈ వైరుధ్యాలన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకొని ప్రజలను ఐక్యం చేసే రాజకీయ దృక్పథమే నేటి అవసరం.నేడు భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంపద మరింత కేంద్రీకృతమవుతోంది. మరోవైపు నిరుద్యోగం, శ్రమదోపిడి, రైతాంగ సంక్షోభం, కుల వివక్ష, వర్ణ వివక్ష, మహిళలపై హింస, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై అన్యాయాలు, ప్రజాస్వామిక హక్కులపై ఆంక్షలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యలను ఒక్కో రంగానికి పరిమితం చేయకుండా సమగ్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథంతో అర్థం చేసుకోవడం అవసరం.ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర కర్తవ్యం ప్రజలను చైతన్యవంతం చేయడం, సంఘటితం చేయడం, సమాజంలోని అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృత ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించడం. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాస్వామిక పోరాటాల ద్వారా ఐక్యపరచడం నేటి ప్రధాన రాజకీయ బాధ్యత. ఈ ఉద్యమాలు ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా, సమాజంలో ఉన్న దోపిడీ సంబంధాలను అర్థం చేసుకునే రాజకీయ చైతన్యాన్ని కూడా పెంపొందించాలి.అయితే ప్రజాస్వామిక ఉద్యమాలు తమంతట తాము అంతిమ లక్ష్యం కావు. మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక శాస్త్రం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పన్నమయ్యే వైరుధ్యాలను శాశ్వతంగా పరిష్కరించాలంటే ఉత్పత్తి సాధనాలపై సామాజిక యాజమాన్యం, శ్రమ ఆధారిత ఉత్పత్తి సంబంధాలు, ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకున్న ప్రణాళికాబద్ధ అభివృద్ధి అవసరం. అందువల్ల ప్రజాస్వామిక ఉద్యమాలు శ్రామిక వర్గ రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తూ సోషలిస్టు సమాజ నిర్మాణం వైపు ముందుకు సాగాలి. అదే శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం యొక్క చారిత్రక సారాంశం.శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ మార్పు కాదు. ఉత్పత్తి సాధనాలపై ప్రజల నియంత్రణ, శ్రమకు గౌరవం, కుల, వర్ణ, లింగ, మత వివక్షల నిర్మూలన, విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కుల హామీ, ప్రజల భాగస్వామ్యంతో ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను నిర్మించడం. అదే సమానత్వ సమాజానికి పునాది.జులై 28 అమరవీరుల స్మారక వారోత్సవాల అసలు సందేశం కూడా ఇదే. ప్రజల కోసం సాయుధ రూపంలోనైనా, నిరాయుధ రూపంలోనైనా ప్రాణాలను అర్పించిన ప్రతి అమరవీరుని నిస్వార్థతను, నిజాయితీని, త్యాగస్ఫూర్తిని స్ఫూర్తిగా స్వీకరించడం. వారు అనుసరించిన ప్రతి పోరాట రూపాన్ని యథాతథంగా పునరావృతం చేయడం కాదు. వారు జీవితాంతం కాంక్షించిన దోపిడీ రహిత, సమానత్వ సమాజ నిర్మాణ లక్ష్యాన్ని నేటి చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా ముందుకు తీసుకెళ్లడం. సమాజంలోని ప్రతి అన్యాయానికి, ప్రతి వివక్షకు, ప్రతి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం. ప్రజల మధ్య రాజకీయ చైతన్యాన్ని విస్తరించడం. ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడం. శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం, సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం నిరంతర పోరాటాన్ని కొనసాగించడం.అదే అమరవీరుల త్యాగాలకు అర్పించగల అత్యంత అర్థవంతమైన నివాళి. అదే వారి ఆశయాలను చరిత్రలో సజీవంగా నిలబెట్టే మార్గం. అదే జులై 28 అమరవీరుల స్మారక వారోత్సవాల అసలు సారాంశం.

జంపన్నడెమోక్రటిక్ సోషలిస్ట్