Screenshot_20231221_203347_WhatsAppBusiness

టిజి సమాచారం సంపాదకీయం

యుద్ధ క్షేత్రం గాజా నుండి ఎర్ర సముద్రం వైపు మారుతుందా?

అమెరికా సారధ్యంలో నేడు ఏర్పడ్డ పదిదేశాల యుద్ధ కూటమి హౌతీ గెరిల్లాలపై గెలుస్తుందా?

హమాస్ చేతుల్లో ఇజ్రాయెల్ ఓటమికి చేరువ అవుతుందా?

వర్తమాన ప్రపంచం చిత్రవిచిత్ర మలుపులు తిరుగుతుంది. ఏ క్షణంలో ఎలాంటి అనూహ్యమైన మలుపు తీసుకుంటుందో అంతర్జాతీయ రాజకీయ పండిత వర్గాలు సైతం అంచనా వేయలేని స్థితి ఏర్పడింది. అలాంటి ఒక మలుపు ఈరోజు కొన్ని గంటల క్రితం జరిగింది. ఆ మలుపు తిరగడానికి మరో నేపధ్య కారణం కూడా ఉంది. అదే సూయజ్ సంక్షోభం!

ఒకటిన్నర శతాబ్దం తర్వాత సామ్రాజ్యవాద వ్యవస్థను కుదిపివేసిన ఓ సంచలన సంఘటనని పేర్కొనాలి. అది వాణిజ్య ప్రపంచ వ్యవస్థ గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఘటన.

సూయజ్ కాలవ గుండా అంతర్జాతీయ దిగ్గజ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల్ని సూయజ్ కాల్వ దారిలో నిన్నటి నుండి నిలిపివేశాయి. అవి గుడ్ హోప్ వైపు మళ్లించాయి. గాజా పై ఇజ్రాయెల్ యుద్దాన్ని విరమణ చేసే వరకూ ఎర్రసముద్రం గుండా ఇజ్రాయెల్ నౌకలను వెళ్ళనిచ్చేది లేదని హౌతీ గెరిల్లా సంస్థ హెచ్చరించింది. అది ఇజ్రాయెల్ నౌకలతో పాటు గాజాపై యుద్ధాన్ని సమర్ధించే దేశాల నౌకల్ని కూడా వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇది అమెరికా సహా ప్రపంచ పెద్ద రాజ్యాల దిగ్గజ షిప్పింగ్ సంస్థలకు వణుకు పుట్టిస్తోంది.

రెండు రోజుల క్రితమే అమెరికా బైడెన్ సర్కారు నేతన్యాహు సర్కారుకి ఓ సూచన చేసింది. గాజా నుండి మధ్యప్రాచ్యం పైకి కేంద్రీకరణ చేయాలని సూచించింది. ఇప్పుడు నేతన్యాహు సర్కారు గాజా అనే ఊబిలో గొంతు లోతులో కూరుకున్నది. అది అక్కడ నుండి ఓ అడుగు ముందుకు వేయలేదు. వెంటనే వెనక్కి కూడా అడుగు వేయలేదు. అలా వేస్తే కూటమిగా మారుతుంది. తుదకు స్వయంగా అమెరికా రంగంలోకి దిగక తప్పలేదు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నార్వే, నెదర్లాండ్స్, కెనడా, బహ్రెయిన్ లతో కూటమి కట్టింది. ఇందులో ఒక్క బహ్రెయిన్ అరబ్ దేశం.

ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎర్రసముద్రం వైపు పంపే అమెరికా ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో ప్రసిద్ధి చెందిన BP, MSC వంటి షిప్పింగ్ సంస్థలు నిన్నటి నుండి ఒక్కొక్కటి తమ నౌకల రూట్ మార్చి ప్రకటనలు చేస్తున్నాయి. గత ప్రపంచ యుద్దాల సమయాల్లో తప్ప ఇలా దుస్థితి వాటికి రాలేదు.

నిన్న BP కంపెనీ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే చమురు ధరలు 4 శాతం పెరిగాయి. సూయజ్ కాల్వకి బదులు గుడ్ హాప్ మీదుగా నౌకలు వెళ్తే సుమారు మరో నాలుగు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. మరో వారం రోజులు అదనంగా సమయం పడుతుంది. వాటికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత అనివార్యంగా అమెరికా మీద పడింది. ఓ చిన్న గల్ఫ్ దేశం, మరో చిన్న ఆఫ్రికా దేశం తప్ప సమీప రెండు ఖండాలకు చెందిన పెద్ద దేశాల్లో ఏ ఒక్కటి కూడా ఈరోజు ఏర్పడ్డ తాజా యుద్ధ కూటమిలో చేరలేదు. ఎక్కడో సుదూరంలోని యూరోప్, అమెరికా ఖండాల దేశాలతో యుద్ధ కూటమిని ఏర్పరిచింది. ఆసియా ఫసిపిక్ ప్రాంత దేశాలలో ఏ ఒక్కదేశం చేరకుండా “ఆకస్ సైనిక కూటమి” ని అమెరికా ఏర్పరిచి భంగపడ్డ చేదు అనుభవం ఉంది. ఐనా గుణపాఠం తీసుకోకుండా ఎర్రసముద్ర ప్రాంతంతో సంబంధం లేని సుదూర దేశాలతో ఈరోజు మరో కొత్త యుద్ధ కూటమిని ఏర్పరిచింది. దీనిని ఏ పేరిట ఏర్పాటు చేసినా, అది యుద్ధ కూటమియే! అది కూడా మున్ముందు ఘోర భంగపాటుకు గురి కాకతప్పదు.

ఎమెన్ హౌతీ గెరిల్లాల సామర్థ్యం అసాధారణ స్థాయిలోనిది. అమెరికా వత్తాసుతో హౌతీ గెరిల్లా సంస్థపై సౌదీ అరేబియా యుద్ధానికి దిగి బోర్లా పడింది. సౌదీ ప్రధాన ఆయిల్ స్టోరేజీల పై క్షిపణి దాడులు చేసి భీతిల్ల జేసింది. దానిపై అమెరికా నేతృత్వంలో తాజా యుద్ధ కూటమి వ్యూహం విఫలం కాకతప్పదు.

ఒక చిన్న రాజ్య రహిత గెరిల్లా సంస్థపై యుద్దానికి పది రాజ్యాలు యుద్ధ కూటమి కట్టాయి. దీనికి మూల కారణం పాలస్తీనా సమస్య కావడం విశేషం! గాజా నేలపై గాజా ప్రజల్ని ధ్వంసిస్తే, ఎర్రసముద్రంలో గాజా ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రతిధ్వనిని “నిశ్శబ్దం” చేయడానికి పది పెద్ద రాజ్యాలతో అమెరికా యుద్ధ కూటమి కట్టి గోచీలు బిగించి యుద్ధం చేస్తే గెలుస్తుందా?

పాలస్తీనా జాతి కోసం, అందులో భాగంగా గాజా కోసం సంఘీభావంగా హౌతీ గెరిల్లా సంస్థ మరో పోరాట క్షేత్రాన్ని ఓపెన్ చేశారు. ఇజ్రాయెల్ కోసం పది రాజ్యాలు మరో యుద్ధ క్షేత్రాన్ని ఓపెన్ చేశారు.

ఇదిలావుండగా, గాజాలో ఇజ్రాయెల్ చావు దెబ్బలు తింటోంది. 19 వేల మంది మరణాలతో పెద్ద శ్మశాన వాటికగా మారిన గాజా మాత్రమే నేడు లోకానికి కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే ఇజ్రాయెల్ కి గాజాయే ఒక శ్మశాన వాటికగా మారుతున్న వాస్తవం కనిపిస్తుంది.

హమాస్ తిరుగుబాటు శక్తుల్ని బయటకు తెచ్చి మట్టుపెట్టడానికి సొరంగ వ్యవస్థను మధ్యధరా సముద్ర నీటితో పంపింగ్ ప్రారంభించి ఈరోజుకు వారం నిండింది. అది ఇప్పటికే లక్ష క్యూబిక్ మీటర్ల నీటిని పంపింగ్ చేసింది. 365 చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో కూడిన గాజా స్ట్రిప్ లో ప్రతి అంగుళం నేలను ఇజ్రాయెల్ సైన్యం తమ పహారాలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ నిఘా వర్గం అప్రమత్తంగా ఉంది. సొరంగాల్లోకి నీళ్లు వస్తే దేశంలో ఏదో మూలన సొరంగ ద్వారాలను తెరుచుకొని హమాస్ బృందాలు బయటకు వస్తాయని ఇజ్రాయెల్ సైన్యాలు నిరంతరం పొంచి చూశాయి. రాత్రి వేళల్లో కూడా కనిపించే కళ్ళద్దాలు ధరించిన నిఘా విభాగాలు, ఆకాశం లో యుద్ధ హెలికాప్టర్ల పహరతో ఎంతో ఆశతో గత వారం రోజుల నుండి కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూశాయి. సొరంగాలు నీటితో నిండాయి. కానీ ఒక్క హమాస్ గెరిల్లా కూడా బయటకు రాలేదు. దీనితో అమెరికాతో సహా ఇజ్రాయెల్ వంటి అనేక పెద్ద రాజ్యాలకు దిమ్మె తిరిగింది.

ఇదిలావుంటే మరోవైపు గాజా యుద్ధ క్షేత్రంగా మారింది. గాజా ప్రజల సహకారంతో హమాస్ గెరిల్లాలు ఇజ్రాయెల్ సైన్యాల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అక్కడ అంతా తాము కూల్చిన శిదిలాలుగా భ్రమించిన చోట కూడా ఇజ్రాయెల్ సైన్యాలకు తీవ్ర గెరిల్లా దాడులు ఎదురౌతున్నాయి. నిన్న మంగళవారం ఉత్తర గాజాలో అలాంటి ఓ గెరిల్లా దాడిలో తొమ్మిది మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. వారితో కలిపి 132 మంది మరణించారు. ఇది కాకుండా ఐదు వేల మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. 1800 మందికి పైగా తీవ్ర క్షతగాత్రులు కావడం గమనార్హం! ఇంతవరకు ఇజ్రాయెల్ పౌర సమాజం అసంతృప్తి, అలజడి ఇక నుండి సైన్యంలోకి కూడా విస్తరించేస్థితి ఏర్పడింది.

నేటికి 74వ రోజుకు చేరిన యుద్ధం. దాదాపు 50 రోజులు దాటిన భూతల యుద్ధం. ఐనా యుద్ధోన్మాద నేతన్యాహు ప్రభుత్వం ఒక్క ఇజ్రేలీ బందీని విడుదల చేయించలేక పోయింది. ఒక్క హమాస్ యోధుణ్ణి నిర్బంధించలేక పోయింది. సజీవంగా నిర్బంధించలేక పోయినా కనీసం వారిని దొరికించుకొని కాల్చిచంపే పనిని కూడా చేయలేక పోయింది. ఇజ్రాయెల్ కి సిగ్గు! అంతకంటే అమెరికాకు సిగ్గుసిగ్గు!

అక్టోబరు 7వ తేదీన అనవసరంగా ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి దిగి తమ పతనాన్ని తామే తెచ్చుకుందని కొందరు భావించారు. ఇజ్రాయెల్ సర్కారు వ్యూహాత్మకంగా రూపకల్పన చేసిన జాతి నిర్మూలన వ్యూహంలో హమాస్ దాడి చేసి ఒక పావుగా దొరికిపోయిందని మరికొందరు భావించారు. వీరంతా పాలస్తీనా ప్రజల ప్రేమికులు కావడం కూడా గమనార్హం! రేపటి చరిత్ర హమాస్ పకడ్బందీగా పన్నిన వ్యూహాత్మక వలలో ఇజ్రాయెల్ పావుగా పడిందనే ఒక పాఠాన్ని అందిస్తుందా? ఏమో చరిత్రను ఇప్పుడే అంచనా వేయగలమా?

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
19-12-2023