షాద్‌నగర్‌లో విత్తన మేళా సందర్శించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి
హైదరాబాద్, జూలై 27:
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్ల గ్రామ రైతు వేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను సోమవారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశమై సాగు పరిస్థితులు, వర్షాభావం ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. పాడి రైతులు పశుగ్రాస కొరతను దృష్టిలో ఉంచుకుని మేత జొన్న సాగును విస్తరించాలని, నగర శివారు ప్రాంతాల రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారిస్తే తక్కువ కాలంలో అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల ద్వారా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. జూలై 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకుని తమ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం పంట పొలాలను పరిశీలించిన ఆయన, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని లాభదాయక వ్యవసాయం చేయవచ్చని తెలిపారు.