images (1)

మన కమ్యూనిస్టుల మొఖాలు ప్రజల దృష్టిలో కళ తప్పుతున్నాయా?

కాయకష్టం చేసి బ్రతికే ప్రజల జీవన ప్రమాణాల కంటే మన కమ్యూనిస్టులే ఉన్నతంగా జీవిస్తున్నారా?

నిరాడంబరత నుండి ఆడంబర జీవితాల వైపు మన కమ్యూనిస్టుల ప్రయాణం సాగుతుందా?

లెనిన్ విప్లవాచరణ అద్దంలో మన మొఖాల్ని శుభ్రం చేసుకుందాం.

నూరేళ్ళ లెనిన్ అమర స్మృతిలో ప్రతిస్పందనగా!

కమ్యూనిస్టు ఉద్యమ ప్రియులారా!

ఒకనాడు మన కమ్యూనిస్టుల వ్యక్తిత్వంపై బండెడు బురద జల్లుతూ బూర్జువా పార్టీలు నిందా ప్రచారం చేస్తుండేవి. బూర్జువా మీడియా కూడా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కట్టుకథల్ని అల్లి, వండివార్చి వడ్డించేది. వారి ప్రచారాన్ని పేద ప్రజలు దూది పింజలా కొట్టి పారేసినా, మధ్యతరగతి ప్రజల్ని ప్రభావితం చేస్తుండేది. ఆ ప్రచారంలో నిజం లేదని తగు సాక్ష్యాధారాలతో కౌంటర్ ప్రచారం చేపట్టాల్సిన బాధ్యత మన కమ్యూనిస్టులకి ఉండేది. అప్పట్లో మన కమ్యూనిస్టుల కర్తవ్యాల్లో అదొకటి! ఆ పని భారం క్రమంగా తగ్గిపోతోంది.

బూర్జువా పార్టీలు మనకు ఆ పని భారాన్ని మోసే అవసరం లేకుండా చేస్తున్నాయి. పైగా మన కమ్యూనిస్టులు గొప్ప గుణవంతులని స్వయంగా కితాబులిస్తున్నాయి. వారి ప్రశంసలు కొన్నిసార్లు మన వర్గదృష్టిని మరిపించే స్థితికి దారి తీస్తున్నది. ఇది మనకు కొత్తఊపు, ఉత్సాహాల్నిచ్చి మన మొహాల్లో కొత్త రాజకీయ కళ వెల్లివిరిసేలా చేస్తోంది. ఇది నాణేనికి ఓవైపు దృశ్యం. అంతకంటే మించి మరో కొత్త ముప్పును కష్టజీవులైన ప్రజల నుండి ముంచుకొస్తోన్నది.

మన కమ్యూనిస్టులు గతంలా విలువల్ని పాటించడం లేదనే విమర్శలు పెరిగాయి. ఇది బూర్జువా పార్టీలు, బూర్జువా మీడియా నుండి ఎదురైతే ప్రమాదం లేదు. మన జనం నుండే విమర్శ వస్తే ఎవరిని కౌంటర్ చేసి ఖండించాలి?

గతంలో వలె నేటితరం కమ్యూనిస్టులు రాజకీయ, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల్లో పని చేయడం లేదనే విమర్శ స్వయంగా పేద ప్రజల నుండే వస్తోంది. ఇది దశాబ్దాల క్రితం గుసగుసలుగా మొదలై, బహిరంగ రూపం ధరిస్తోంది.

నేడు కమ్యూనిస్టు పార్టీలుగా ప్రజలు వేటిని నమ్ముతున్నారో వాటిలోని గణనీయ శాతం నేతల వ్యక్తిత్వాలు శ్రామిక ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేవిగా లేవు. భావి సోషలిస్టు సమాజ ప్రతీకలుగా లేవు. బూర్జువా పార్టీల నాయకుల కంటే మెరుగ్గా ఉంటే సరిపోదు. కమ్యూనిస్టు వ్యక్తిత్వమంటే మౌలికంగానే భిన్నమైనది.

తాము ఆరుగాలం కష్టించి పంటలు పండించినా, శ్రామిక వృత్తుల్ని నిర్వర్తించినా తమవి రుణగ్రస్త బ్రతుకులేననీ, మన కమ్యూనిస్టు నేతల్లో కొందరు తొలుత నిస్వార్థ పరులుగా, నిరాస్తిపరులుగా మన పార్టీల్లో చేరి, క్రమంగా నయా సంపన్న వర్గంగా ఎదిగినట్లు సామాన్య జనం తమ కళ్ళతో చూసే ప్రాథమిక ఆధారాలతోనే విమర్శిస్తున్నారు. అందులో సత్యం ఎంత ఉందనే కంటే, చిత్తశుద్ధితో నమ్మి చేస్తున్న విమర్శగా మాత్రం చూడాలి.

బూర్జువా పార్టీలు, మీడియా మన పై నిందా ప్రచారం చేసిన రోజుల్లో మన ప్రజలు వాటిని నమ్మలేదు. పైగా అదో కుట్రగా ఖండించారు. ఇప్పుడు ప్రజలే విమర్శ చేస్తున్నారు. ప్రజల కుట్రగా ప్రచారాన్ని చేస్తామా?

నిరాడంబరంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం (SIMPLE LIVING HIGH THINKING) కమ్యూనిస్టులకి ఒక బండ సూత్రంగా ఉండాలి. అది మన కమ్యూనిస్టులు ఇప్పుడు ఆచరిస్తున్నారా?

నూరేళ్ళక్రితం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అప్పటి మన కమ్యూనిస్టులకి ఆదర్శం. యాబై ఏళ్ల క్రితం సగటు జీవన ప్రమాణాలు అప్పటి కమ్యూనిస్టులకు ఆదర్శం. పాతికేళ్ల నాటివి కూడా అంతే! ఇప్పటిది కూడా అంతే! ఈ బండ సూత్రాన్ని మనం పాటిస్తున్నామా?

సిద్ధాంతం, ఆచరణ మన క.పార్టీల జంట అంశాలే. ‘కార్యక్రమం’, ‘పంథా’ సిద్ధాంతంగా, విప్లవోద్యమ నిర్మాణ కృషిని ఆచరణగా భావిస్తాయి. ఇవే ‘పొలిటికల్ లైన్’; ‘పొలిటికల్ లైఫ్’! (అవే క్లుప్తంగా ‘లైన్’ & ‘లైఫ్’)

మన ‘లైన్’ కంటే మన ‘లైఫ్’ ముందుగా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. తొలుత సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి మన పక్షం వహించరు. సమస్యల కోసం సమీకృతులౌతారు. మన విలువలు, పనివిధానం, నిరాడంబర జీవన విధానం పట్ల ఆకర్షితులై మానసికంగా దగ్గరౌతారు. ఆ తర్వాతే మన రాజకీయాల్ని అధ్యయనం చేస్తారు. గాన మనం ‘మంచి కమ్యూనిస్టులు’ గా పనిచేస్తే ప్రజాదరణ పెరుగుతుంది. అట్టి మంచి కమ్యూనిస్టులుగా మనం పని చేస్తున్నామా?

విప్లవ కార్యాచరణకు, వర్గ పోరాటాలకు తగు ప్రాధాన్యత ఇవ్వకుండా సిద్ధాంత పండిత చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే ఒక సందర్భంలో లెనిన్ PRACTICE IS GREEN; THEORY IS GREY అంటాడు. విప్లవాచరణ నుండే విప్లవ సిద్ధాంతం పుట్టి పెరిగిందనీ సిద్ధాంతాన్ని సైతం ఆచరణలో సమీక్షించబడి అవసరమైతే సవరించాల్సిన సందర్భాలు వుంటాయి. ఈ దృష్ట్యా లెనిన్ సిద్ధాంతం కంటే ఆచరణ గొప్పదన్నాడు.

మార్క్స్ నుండి మావో వరకు అనుసరించిన నిరాడంబర జీవన విధానం మనకు మార్గదర్శకం కావాలి.

రష్యా సోషలిస్టు విప్లవ రధసారధి, మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ మరణించి ఈ నెల 21వ తేదీకి నూరేళ్ళు! ప్రపంచ శ్రామికవర్గ విప్లవ సంస్థలు ఒక చారిత్రక సంస్మరణను చేపట్టే రోజు ఇరవై రోజుల్లో రానుంది. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా శ్రామికవర్గ విప్లవ సంస్థలు ఆయన సైద్ధాంతిక, రాజకీయ కోణాల్ని సృజిస్తాయి. తమ భావి కర్తవ్యాల రూపకల్పన కోసం ప్రయత్నం చేస్తాయి. వాటిలోకి వెళ్లడం లేదు. లెనిన్ జీవిత కార్యాచరణ నుండి, ముఖ్యంగా తన నిరాడంబర జీవితం నుండి నేర్చుకునే అంశాన్ని ప్రస్తావిద్దాం.

లెనిన్ లైన్ కాకుండా లైఫ్ గూర్చి శతవర్ధంతి సందర్భంగా ప్రస్తావిద్దాం. నిరాడంబర జీవన విధానం, శ్రామికవర్గంతో మమేకమైన పని విధానాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నిద్దాం.

ఈ శతవర్ధంతి సందర్భంగా ఈరోజు నుండి ఇరవై రోజుల పాటు లెనిన్ విప్లవ జీవితం నుండి మన కమ్యూనిస్టులు నేర్చుకునే లేదా స్ఫూర్తి పొందే ఘటనలు, అనుభవాలను నా అవకాశాన్ని బట్టి చిన్నచిన్న బిట్స్ గా వెలుగులోకి తెచ్చే ఒక ప్రయత్నం చేద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
2-1-2024