IMG-20260815-WA0032

హైదరాబాద్‌ సిటీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌:

పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీపీ వీసీ సజ్జనర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులర్పించారు.విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావం కనబరిచిన 72 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేకంగా హెచ్‌-ఫాస్ట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సమన్వయంతో కల్తీదారులపై జీరో టాలరెన్స్‌ విధానంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి శోభాయాత్రలు, ఇటీవల ముగిసిన ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించిన పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.సైబర్‌ నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ప్రారంభించామని, దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన ‘సీ-మిత్ర’ వర్చువల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 1,700కు పైగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. ఫిర్యాదుల నమోదులో ‘ఏఐ కాప్‌రైటర్‌’ యాప్‌ కీలకంగా ఉపయోగపడుతోందన్నారు.మహిళల రక్షణ కోసం ప్రారంభించిన ‘స్పందన–తక్షణ రక్షణ’ మహిళా రెస్పాండర్‌ వ్యవస్థ రోజుకు సగటున 30 ఫిర్యాదులను స్వీకరిస్తోందన్నారు. త్వరలో 300 మంది మహిళా సిబ్బందికి డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.నగరంలో డ్రగ్స్‌ నియంత్రణకు ‘హెచ్‌-న్యూ’ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని, మాదకద్రవ్యాల విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.కార్యక్రమంలో పలువురు డీసీపీలు, అదనపు డీసీపీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.